Avirbhava Publishing House - Avirbhava Fifth Edition November 2019
చెట్టు ముందా? విత్తు ముందా? అన్న ప్రశ్నని వదిలేస్తే, విత్తులో ఒదిగి భూమిలో ఉన్న పెద్ద వృక్షం భూమిలోనే ప్రాణ ప్రతిష్ట చేసుకుని, బయటికి రావడానికి అడ్డుగా ఉన్న తల్లి భూమి పొరలను తన లేలేత చిగురుతో అడ్డు తొలగించుకుని, తన మీద పడుతున్న సూర్యభగవానుడి కిరణాలతో బలం పుంజుకుని ,తనని తొక్కే జీవాలను తప్పించుకుని , భూమిలోని జీవామృతాన్ని గ్రోలి,వడివడిగా ఎదిగి, మొక్కై,చెట్టై, వృక్షమై జీవాలన్నిటికీ నీడనిస్తూ హాయిగా, ఆనందంగా తల ఎత్తుకుని బతుకుతుంది. తన సృష్టికి కారణమైన తల్లిభూమికి ఒక గౌరవాన్ని కలిగిస్తుంది. ప్రకృతిలో భాగమవుతుంది. ఇలా ఎదిగే క్రమంలో మనిషి అవసరం చెట్టుకి లేదు. సముద్రాలు వెల్లగక్కే ఆవిరిని ఒడిసిపట్టుకుని వర్షించే మేఘం తాను అందించే నీటి ద్వారా వృక్ష జంతుజాలాలకి ప్రాణాన్ని ఇస్తుంది. ఇలా ఇచ్చే క్రమంలో మనిషి అవసరం మేఘానికి లేదు. గల గలా ప్రవహిస్తూ తాను వెళ్లే మార్గం లో ఉన్న జీవజాలానికి ఉనికి ఏర్పాటు చేస్తూ వెళ్తున్న నదికి మనిషి అవసరం లేదు. తన కిరణాలతో సృష్టికి జీవం పోస్తున్న సూర్య భగవానుడికి మనిషి అవసరం లేదు. తన చల్లని కిరణాలతో మనిషిని జోకొట్టి నిద్ర పుచ్చుతున్న వెన్నెల రేడుకి మనిషి అవసరం లేదు. సృష్టి లోని ఏ జీవమైనా కూడా మనిషి అవసరం లేకుండానే తన జీవన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. అది వృక్షమే కావచ్చు,జంతువే కావచ్చు. కానీ మనిషి అవేమీ లేకపోతే మనలేడు. సృష్టిలోని అన్నిటినీ ఉపయోగించుకుంటూ తన మనుగడకు సార్ధకతను పొందుతున్న మానవుడు తన వల్లే పాడవుతున్న ప్రకృతిని పట్టించుకోవడం లేదు.ప్రకృతిని కాపాడుకునే కనీస అవసరం మానవుడిది. మానవుడు పుట్టక ముందునుండి భూమి ఉంది. పొత్తిళ్ళలోకి రాబోయే పాపాయికి ఎంతో ప్రేమతో ఆప్యాయంగా తల్లి మెత్తని పక్కని ఏర్పాటు చేసినట్లుగా, అవని ప్రకృతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. గాలి,నీరు,నీడ అన్నీటినీ ప్రకృతిలో భాగం చేసింది. తాను చేసిన ఏర్పాట్లను తరచి తరచి చూసుకుంది. కొన్ని వేల ఏళ్ళు పురిటి నొప్పులు పడి మానవ ఆవిర్భావానికి స్వాగతం పలికింది. పసికందుని గుండెలకు హత్తుకుని మురిసిపోయింది. ఏ స్థితి లో కూడా తన బిడ్డ బాధ పడకూడదని ,ఆకలితో అల్లాడ కూడదని అన్ని రకాలుగా ఆహారాన్ని సిద్ధం చేసి ఉంచింది. పరిణామ క్రమంలో మానవుడు తనని ముక్కలు చేసినా సహనంతో భరించింది. గునపాలు గుచ్చినా తన పిల్లలే కదా అని ప్రేమతో ఆ నొప్పిని పట్టించుకోలేదు. బాధని గుండెల్లో దాచుకుని కొండంత ప్రేమని ఇచ్చింది. శరీరానికి తగిలిన గాయాలను ఆహారంగా మార్చి అందించింది, రక్తాన్ని పాలలాగా ఇచ్చిన మాతృప్రేమ అందులో ఉంది. కాని ఇప్పుడు మన తల్లి భూమాత వయోభారంతో కృంగిపోతున్నది.. వణుకుతున్న శరీరం ఇక దెబ్బల్ని ఏ మాత్రం తట్టుకోలేనంటున్నది. తన బిడ్డకు కష్టం కలగకూడదని అన్ని రకాలుగా ఒక సుఖమయమైన జీవితం కొరకు తనతో పాటు ప్రకృతిని సమాయత్తం చేసిన తల్లి జనని ఇప్పుడు అలసిపోతున్నది. ఆ అలసట స్పష్టంగా తెలుస్తున్నది. ఆహారాన్ని అందించిన చేతులు ఆసరా కోరుతున్నాయి. మన కొరకు ఎన్ని త్యాగాలో చేసిన మన అమ్మను రక్షించుకునే బాధ్యత మనదే. ఇందుకు ముఖ్యంగా యువత నడుం బిగించాలి. వారి తర్వాత వచ్చే తరాన్ని కాపాడుకునే కర్తవ్యం వారిదే. వారి తర్వాతి తరానికి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాల్సిన అవసరం వారిది. ఆ శక్తి యువతరానికి మాత్రమే ఉంది. రవ్వంత ప్రేమ పంచితే తిరిగి వేయిరెట్ల ప్రేమను అందించే మన తల్లి భూమాతను కాపాడుకుని రాబోయే తరానికి ఆరోగ్యకరమైన ప్రకృతిని అందిద్దాం. రండి చేయి కలపండి.
Go BackYou will receive notification on email .
Click on the button below to confirm your subscription.
Your subscription has been confirmed. Undo
Opps!!! Due to some reason your request can not be fullfilled now. Please try later or contact us helpdesk@readwhere.com
You are already subscribed to this publication using email .
Click on the button below to cancel your subscription.
Your subscription has been cancelled successfully.