Avirbhava Publishing House - Avirbhava 3rd edition October 1st 2019
ఆవిర్భవ తత్వ పత్రం ఏంటి మేము ? ఎవరు మేము ? ఎందుకు మేము? కాన రాని కళలకు నిదర్శనం మేము , చితికిన బ్రతుకుల ఆక్రోశం మేము, జననికి ,అవనికి, భువనికి, అబలకి అండ మేము పదహారణాల తెలుగు గళం మేము రాజ తత్వానికి సూత్రం మేము యువ చరిత్రకు ఘట్టం మేము మరో సూర్యోదయపు ఆవిర్భవం మేము ప్రజా గళంగా మారిన కలం మేము వార్త మేమే అభిప్రాయం మేము మీరన్న వ్యక్తిత్వానికి ప్రతిబింబం మేము మీరే మేము ... ఆవిర్భవ మీడియా ఫౌండేషన్ ప్రస్తుత కాలం మనం అన్న వేరుని మరచి పరాయి సంస్కృతి మోజులో పడి తెలుగుని వెలుగు లేకుండా చేసే పరిస్థితిని తెచ్చింది . మనకెందుకులే? అన్న పద్దతికి అలవాటుపడ్డ సమాజపు ధోరణిలో పడకుండా .... ఓ చిన్న మార్పుగా ,మరో చిన్న జ్ఞాపకంగా మారాలని తలచి ఆవిర్భవించాము .... సాహిత్య గళం గా మారి పత్రిక రూపాన . ప్రస్తుత పరిస్థితిలో మనం అన్న సంస్కృతిని కోల్పోయే పరిస్థితి చూసి ,విశ్లేషించి ,కారణాలుగా నిలిపిన సాంకేతికత ను ప్రశ్నించకుండా ,కదిలే కాలాన్ని సాక్ష్యంగా పెట్టి అదే సాంకేతికతతో స్నేహ హస్తం కలిపి ప్రజా గళంగా మీ ముందుకొచ్చాము. . మాధ్యమాలు అనేకం తత్వం ఒక్కటే మారుతున్న కాలానికి సమాధానంగా మమ్మల్ని మేము మలచుకొని అనేక మాధ్యమాలుగా ఆవిర్భవించాము. మా తత్వ వాక్యం ... తెలుగు సాహిత్య సాంస్కృతిక పునరుద్ధరీకరణ వేదికగా నిలవాలి అనే తపన. దానికి మేము ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము అని ఢంకా కొట్టకుండా ఓ ప్రణాళికతో నిశ్శబ్ద విప్లవంగా మారాలి మేము అన్న తపనతోనే ఆవిర్భవ నెలకొంది. పుస్తక ప్రచురణ వేదిక ప్రతి కవి ,రచనా జీవులు తమ మనస్సున మెదిలిన ఆలోచనలని అక్షర రూపంగా మార్చటానికి అహర్నిశలు తపన పడి ఓ పుస్తక రూపానికి తెచ్చుకొని ఆశగా చెప్పులు అరిగే వరకు, ఓ మనస్సుకన్న ప్రచురణ కర్త కోసం వెతకుతూ అలసి సొలసి చివరకు వేసారి నిరుత్సాహపడి ఆ రాసిన అక్షరాన్ని ఎక్కడో కట్టలమద్య ఓ జ్ఞాపకంగా పెట్టి మర్చిపోతారు. ప్రతి ప్రచురణ కర్త తనకి ఓ రూపాయి వస్తుంది అనే వ్యాపార ధోరణిలో ఉండి ఆ రచనకు విలువ గాంధీ బొమ్మల కట్టలతో పోల్చుకొని, “అయ్యా! మీ పుస్తకం మేము ప్రచురిస్తాం, కానీ దానిమీద మీకు పేరు వస్తుంది కానీ డబ్బు ఎక్కువ ఆశించలేరు” అని చెప్పి జ్ఞాన చోరులుగా మారారు . తనకి పేరు వస్తే చాలు అన్న ఆలోచనతో తను రాసిన అక్షర విలువ తెలియక ఆ పుస్తకాన్ని ధారాదత్తం చేసి ఓ పది పుస్తకాలు తన చేతికి రాగానే ,ఆనందోత్సాహాల వెల్లువల మధ్య తను దోపిడికి గురి అయిన విషయాన్ని కూడా గ్రహించడు. ఆవిర్భవ ప్రచురణలో ఓ పద్ధతి పాటిస్తుంది. అనవసరమైన ఖర్చులను, ఆర్భాటాలని దూరంగా ఉంచి ప్రతి అక్షర కారుల అభిప్రాయానికి విలువ ఇచ్చి, ప్రస్తుత పాఠకుల మనోస్థితిని ప్రతిబింబించేలా వారి అక్షరాన్ని పుస్తక రూపేణా ఆవిష్కరిస్తున్నాము ‘ఆవిర్భవ పబ్లిషింగ్ హౌస్ ‘ద్వారా. ఆడియో విజువల్ బుక్స్ కాలంతో పరిగెత్తే శైలిని కూడా దాటి, కాలం కన్నా ముందే నిలబడాలన్న కోరికతో ఉరకలేస్తున్న యుగం మనది. పుస్తక పఠనం మంచిది అనేది ఓ సూక్తిగా మాత్రమే మిగిలిపోయే దుస్థితి నుండి వయోభేదం లేకుండా అందరిలోనూ పుస్తక పఠన అలవాటును ప్రోత్సహించాలంటే వారిలో చదవాలి అనే ఆసక్తిని పెంచాలి. అందుకే పుస్తకాన్ని ఆడియో విజువల్స్ రూపంలో , టీజర్స్ రూపంలో ఆవిష్కరించి ‘పుస్తక పఠన ‘ అలవాటును మరింత బలపరచడానికి మా వంతు ప్రయత్నమే ఇది. అందుకే అదే పుస్తకాన్ని దృశ్య శ్రవణ కల్పికగా మలచి, ఆ అక్షర బ్రహ్మ పదాన్ని మీముందుకు తెస్తున్నాము . ఇది తెలుగు పద చిరంజీవత్వానికి అందించే మా ప్రయత్నం .అక్షర భావాన్ని ఇంటర్నెట్లో పెట్టిన క్షణం మొదలు అది ఓ కాలానికి అందని శిలా ఫలకంగా మారుతుంది .తరాలకి, సంస్కృతికి దర్పణంగా మిగులుతుంది. మార్కెటింగ్ మారిన కాలం ఓ రచయితకి తన పుస్తక ప్రచురణలో అవగాహన లేక ఓ భారంగా మారిన తరుణం ఇది. పుస్తక ప్రచురణ కూడా ఓ వాణిజ్యంగా మారిన రోజుల్లో మన తెలుగు అక్షర సాధకులకి తన పుస్తకాలన్ని విక్రయించటానికి ISBN కేటలాగింగ్ అవసరం అన్న అవగాహన ఇప్పించి వారి జ్ఞానాన్ని ఎవరు చౌర్యం చేయకుండా ఆ పుస్తకానికి కాపీరైట్ తీసుకువచ్చే పని మేము చేసి అదే పుస్తకాన్ని డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా దక్షిణ భారత పుస్తకశాలలలో అమ్మే అవకాశం కల్పిస్తున్నాము , ఆవిర్భవ పబ్లిషర్స్ అండ్ మార్కెటింగ్ అనే వేదికతో . తెలుగు సాహిత్య వేదికగా నేటి తరం డిజిటల్ రేడియో ‘తరం మారింది, మనం మారాలి’ అన్న ఓ చిన్న విజ్ఞప్తితో..... పుస్తకాన్నే మీ మాధ్యమం అనుకోకండి అన్న పిలుపుని ఆయుధంగా చేసి , కోల్పోతున్న మన మాతృభాష విలువని తెలపటానికి ఆవిర్భవ అస్త్రంగా మలిచి సంధిస్తున్నవే మా నాలుగు డిజిటల్ రేడియోలు... తానై జన్మ ఇచ్చినపటినుంచి , తానై మన సగంగా నడిచే స్త్రీకి ... ఆలంబ నేస్తంగా మారదాము అన్న ఆకాంక్షతో ఆవిర్భవ మీడియా ఫౌండేషన్ మహిళా ఆవిర్భవ డిజిటల్ రేడియో గా మీ ముందుకు వచ్చింది .ఇందులో తన సొంత ధోరణిని అబలకు అంటగట్టిన సమాజపు రూపుగా ఉండకుండా అసలైన మహిళా వ్యక్తిత్వానికి దర్పణమయ్యే పరిచయ వేదికగా అసలైన సబలల అభిప్రాయాలని నవతర సమాజానికి చేర్చే వారధిగా వచ్చాము. ‘ఇటాలియాన్ ఆఫ్ ద ఈస్ట్’ గా ప్రజ్వరిల్లిన తెలుగు సాహిత్యం నేటి తరంలో మన మాతృభూమిలో పుట్టిన వారికే పరాయిగా మారుతుంది. ఈ తిరోగమన దృక్కోణాన్ని చూసి మనకెందుకులే? అన్న నిర్లక్ష్యానికి తావివ్వకుండా , మనదన్న సంస్కృతిని కొద్ది పాటి సాంకేతికత సహకారం తీసుకొని, అక్షరాన్ని స్వర రూపంలోకి మలచి మీ ముందుకు వచ్చింది ఈ సాహిత్య ఆవిర్భవ డిజిటల్ రేడియో . జన పదం మన పదంగా మారినదే జానపదం. అందులోని అందాలుగా మన తెలుగు భాష యాసలు ప్రతి ప్రాంత సంప్రదాయాలకు , ప్రతి ఊరి సంస్కృతికి, ఓ దర్పణంగా ఉండాలి అనే కాంక్షతో ,ప్రతి జానపద కళాకారులకి వేదికగా మేమున్నాము అన్న ధైర్యంగా వచ్చాము జానపద ఆవిర్భవ డిజిటల్ రేడియో గా. ఇది మా తరపున కోల్పోతున్న తెలుగు జానపదానికి చిరు దివ్వెగా ఉండాలన్నది మా ఆశయం. యువ ఆవిర్భవ డిజిటల్ రేడియో తెలుగు యువత లేవరా దీక్ష బూని సాగరా ,మాతృ భాష స్వేచ్ఛ కోరి మేలుకొలుపు పొందరా..... అన్న పదవాహినితో నేటి యువతకు ఆహ్లాదం అందిస్తూనే.... తెలుగు భాషపట్ల వారికున్న బాధ్యతను గుర్తు చేసే తలంపుతో మా ప్రయత్నంగా నిలిచింది . ఇందులోని కార్యక్రమాలు యువతకి చేయూతగా నిలిచేవిగా ఉండి ,వారిని ఉత్తేజపరచటమే కాక, వారి వాక్కుకి ఓ వేదికగా నిలుస్తూ ,తెలుగు భాషని పునః పరిచయం చేయాలి అన్న బాధ్యత ఆవిర్భవ తీసుకుంది. పత్రిక ప్రతీకగా....... ప్రతి పక్షం మీదన్న గళానికి, మేము ఓ అక్షర రూపంలో మలిచి, మీ ముందు సాక్ష్యంగా నిలిచే మాధ్యమమే మా ఆవిర్భవ పక్ష పత్రిక. పత్రిక సిద్ధాంతం ఏదో ఒక వర్గానికి పరిమితం కాకుండా వ్యక్తిగత అస్థిత్వం మొదలుకుని సమాజం వరకు పునాదులైన రాజకీయం ,సాహిత్యం ,మహిళా ,యువత ,సినిమాల సమ్మేళనంతో సమగ్ర దృష్టితో రూపొందించబడినదే ఆవిర్భవ పక్ష పత్రిక. క్రొత్త రచనలకు స్వాగతం పలుకుతూనే, అనుభవాల్ని కూడా జీవనయాన సామీప్యానికి తీసుకువచ్చే ఆలోచనల సమాహారం ‘ఆవిర్భవ.’ నారీ గమనం అటు పురోగమనం, ఇటు తిరోగమనం లా సందిగ్ధ స్థితిలో ఉన్న తరుణాన, నిజ జీవితంలో స్త్రీ దర్శనం ఆవిర్భవ. తెలుగు సాహిత్యంలో తమదైన ముద్రలు వేసుకున్న గొప్ప వ్యక్తిత్వాల అక్షర రూపం , కుటుంబమంతా ఆహ్లాదంగా చదువుకోవడానికి వీలుగా కథలు ,కవితలు .అలాగే మన సంస్కృతికి ప్రతీక,ఇలా విభిన్న అంశాలతో పాఠకులకు సాహిత్య లోకాన్ని ఆవిష్కరింపజేసేదే సాహిత్య వర్గం. రాజకీయంలో జరిగే సంఘటనలు పౌరులపై, దేశంపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అటువంటి ఘటనలను కేంద్రం , సందర్భం , తెలుగు రాష్ట్రాలు వంటి అంశాలతో విశ్లేషించబడుతుందే రాజ్యం(రాజకీయ ) వర్గం. దేశ శక్తిలో దాదాపు 70 శాతం మంది యువతే. వారిని సంఘటితపరిస్తే దేశ దిశ మారుతుంది అన్న స్వామి వివేకానంద సందేశాన్ని తత్వంగా స్వీకరించి యువతను ప్రేరేపించేదే యువ వర్గం . పైకి కనిపించే మెరుపుల వన్నెలు మాత్రమే కాదు సినీ హంగులు. దానిలోనూ ఎన్నో వ్యథలు ఉన్నాయి ,కన్నీటి కథలున్నాయి. ఆ కన్నీటిని ఆనందభాష్పాలుగా మలచుకున్న వ్యక్తిత్వాల అందమైన దృశ్యమే సినీ వర్గం . ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే .... మనలోని ప్రతి ఒక్కరి కథ …. మన ఊహల ఇంద్రధనస్సు.... వాస్తవిక దృక్కోణాలు ...... ఆలోచింపజేసే ప్రశ్నలు ...... ఇదే ఆవిర్భవ. ఎందుకు మేము ? మా మూల ఆలోచన: సమాజం అన్నదానికి మూలమే ఓ స్త్రీ. మన భారతీయ స్త్రీ ఓ కల్పిత స్వరాజ్యం అనే మయసభలో తన జీవితాన్ని గడుపుతున్నది. దానికి ఎన్ని కారణాలున్నా అసలు కారణం మాత్రం సాంప్రదాయ సంకెళ్ళు అనేవి నిరక్ష్యరాస్యతగా ఉండటం వల్ల. ప్రతి యుగంలో , ప్రతి తరంలో మన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలలో స్త్రీలకి ఇచ్చిన గౌరవం ఆ స్త్రీకి ఉన్న అక్షరజ్ఞానం వల్లే. కానీ రాను రాను మన తరానికి వచ్చేసరికి కొన్ని వర్గాల స్వార్ధంతో మన పెద్దల రాతపూర్వక సంస్కృతికి అర్ధాలు మార్చి తమకు అనుగుణంగా మలచి, స్త్రీని అబలగా మార్చారు. కానీ అబల నుంచి సబలగా మారాలి అన్న తపనతో ఉన్న స్త్రీలకు ఆయుధంగా మారింది అక్షరాస్యత. మన సమాజంలో ఇంకా ఉన్న దురాచారాల వల్ల ఓ ఆడపిల్ల అక్షరాస్యతకు తగదు అన్న ప్రచారం వెల్లువెత్తుతున్న వేళ ఆవిర్భవ తన వంతు ఉడుత సాయంగా నిలుపుతున్న వారధే ఆడపిల్లలు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించటం. దానికి గాను ఆవిర్భవ మీడియా ఫౌండేషన్ ద్వారా వచ్చే ఆదాయంలో సగం కుగ్రామాల్లో బాలికల విద్య ప్రోత్సహించటానికి వినియోగిస్తున్నాము. మన దేశంలో అల్పంగా చూసే ఉద్యోగాల్లో ఆదాయం లేని ఉద్యోగాలంటూ అపవాదు ఉన్నది ఓ అక్షర రూపకర్తకే. అదే అండీ .....కవి ,రచయితలైన మన సాహితీవేత్తలకు. అందుకేనేమో వారు కలం కలపగలరు కానీ గళం ఎత్తలేరు, అనే ధీమాతో వారి జ్ఞానాన్ని చౌర్యం చేస్తున్న చిన్నపాటి నుండి పెద్ద సంస్థల వరకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవ పుస్తక ప్రచురణ ద్వారా వచ్చే సగం ఆదాయాన్ని వారి కోసం కేటాయిస్తున్నాము. వారి కష్టాన్ని వారికి చేర్చే మాధ్యమంగా ‘ఆవిర్భవ ‘ ఓ సాహిత్య వారధిగా నిలవాలని ఆశ. శరదిందు సమాకారే పర బ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతీ నమో స్తుతే!! అన్న శ్లోకాన్ని మననం చేసుకుంటూ తల్లి సరస్వతి సాక్షిగా మీరన్న విశ్వాసంతో మా అక్షర యజ్ఞం మొదలు పెట్టాము. ఇట్లు మీ కుటుంబం ఆవిర్భవ
Go BackYou will receive notification on email .
Click on the button below to confirm your subscription.
Your subscription has been confirmed. Undo
Opps!!! Due to some reason your request can not be fullfilled now. Please try later or contact us helpdesk@readwhere.com
You are already subscribed to this publication using email .
Click on the button below to cancel your subscription.
Your subscription has been cancelled successfully.