ఆవిర్భవ నాలుగవ సంచిక అక్టోబర్ 15 2019
ఆవిర్భవ నాలుగవ సంచిక అక్టోబర్ 15 2019

ఆవిర్భవ నాలుగవ సంచిక అక్టోబర్ 15 2019

  • 4th Edition October 15th 2019
  • Price : Free
  • Avirbahva Publishers
  • Language - Telugu
  • Published fortnightly
This is an e-magazine. Download App & Read offline on any device.

లైఫ్ స్టైల్స్ మనలో ఒక్కరు 4 ఫ్యాబ్ లివింగ్ 6 మహిళా శక్తి 9 నేటి సౌదామిని 12 మేలుకొలుపు 15 సాహిత్యం సాహితి మార్గదర్శి 19 కథా సమయం 22 నేటి కవిత్వం 31 పుస్తక దర్పణం 33 సంస్కృతి 35 సీరియల్ 38 యువత స్నేహ స్వరం 45 జిజ్ఞాస 47 కార్య భారతం 48 రాజకీయం సందర్భం 55 జాతీయం 58 తెలంగాణం 59 ఆంధ్ర దర్పణం 60 సినీ దర్పణం సక్సెస్ అడ్రెస్ 61 గత సినీ వైభవాలు 63 మా తత్వం 67

సంపాదకీయం 

మాట కావాలి పూదోట...!!!

“అక్షరం...నాశనం కానిది...

అనంత శక్తి కలది. 

ఎల్లలు లేనిది. 

భూగోళమంతా… వ్యాపించినది.” 

నమ్ముకున్నవాడికి జ్ఞాన జ్యోతిని వెలిగించి, జీవన జ్యోతిని వెలిగేలా చేసేది. అమ్ముకున్నవాడికి ధనరూపంలో సర్వసుఖాలు ఇచ్చేది   అక్షరం 

          ఒక్క అక్షరానికే అంత విలువ ఉంటే, అక్షరాలతో ఏర్పడే పదాలకు ఎంత శక్తి ఉండాలి? ఆ పదాలను మాటలుగా మార్చి పలికినపుడు జరిగే సన్నివేశాలను గమనిస్తే, వాటి ప్రభావానికి జీవితాలే తల్లకిందులు కావచ్చు అందుకే పెద్దలంటారు...మాట పెదవి దాటిందంటే...పృధివి దాటుతుంది అని.

           మాట తూటాగా మారితే ఎదుటి మనిషి గుండెను చీలుస్తుంది. అదే మాటను పూవులా విసిరితే గాయపడిన మనసుకు స్వాంతన కలిస్తుంది. నవనీతమై ఆ మనిషి ఆవేదనను  పాలపొంగుపై నీళ్ళు చల్లితే  తగ్గినట్టుగా  తగ్గిస్తుంది.

            మాటలు ఎందరెందరో ఎన్నో రకాలుగా మాట్లాడతారు. 

వారిలో ఒక రకం వాళ్ళు  ‘నేను చాలా నిక్కచ్చి మనిషిని. ఉన్నదున్నట్లు మాట్లాడతాను.ఎవరేమనుకున్నా సరే.’      అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు. సర్వం తమకే తెలుసు. ఎదుటివాళ్ళు  అజ్ఞానులు  అనుకునే  తత్వం  వారిది.

 వాళ్ళు అలా మాట్లాడటానికి కారణం  వారి వెనుక వున్నా  ధనమో,  కులమో,మతమో, బలమో ఖచ్చితంగా అయి ఉంటుంది.

  వారికున్నది నిలువెల్లా అహంకారం. అలాంటివారి చుట్టూ గతిలేక ఆశ్రయించిన అవకాశవాదులే తప్ప, నిజమైన స్నేహితులు వాళ్లకు ఉండరు. ఏదైనా చేటుకాలం దాపురించి వారిపై ఆధిపత్యం చెలాయించగలిగిన మరో వ్యక్తి  ఎదురైన నాడు వారిచుట్టూ ఆశ్రితులమని చెప్పుకునే వాళ్ళు అంతా, తలో దిక్కూ పారిపోగా, అంతవరకూ అహంకారపు మాటలు మాట్లాడిన వ్యక్తీ చలిచీమల చేత చిక్కన పామైపోతాడు. ‘తన తామసం తన మసి’ అన్న నానుడికి ఉదాహరణగా మిగిలిపోతాడు. అందుకే పొగిడేవాడు లేనప్పుడు, కష్టాలు  చుట్టుముట్టినప్పుడే మనమేమిటో మనం తెలుసుకోగలం అంటారు పెద్దలు.

            కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడతారు. మాటలో వంకర, మనసులో కూడా వంకర. ఎదుటి వాడు ఏం మాట్లాడినా అందులో ఒక పదాన్ని తీసుకుని వారిని అవమానించే వ్యంగ్య పరుష జాలంతో మాట్లాడతారు. తమను ఎవరైనా ఒక్క మాట వ్యంగ్యంగా మాట్లాడినా  తట్టుకోలేరు. పదిమంది లో తమను పెద్దగా అవమానం చేసినట్టు బాధపడిపోతారు. అందుకే ‘తన   దాకా వస్తే గానీ తెలీదు’ అంటారు  పెద్దలు. మాటలు మాట్లాడే విధానం నేర్చుకోవడం కూడా ఒక కళే.

            కొందరు కోపంగా మాట్లాడతారు. ఆవేశంలో నోరు అదుపు చేసుకోలేక ఎంతమాట అనకూడదో అంత మాట అనేస్తారు. తీరా అనేసాకా ‘’మన్నించండి ‘’ అనడానికి అహం అడ్డొస్తుంది. అహాన్ని చంపుకోలేక, అలా అని క్షమించమని అడగలేక మధనపడుతూ ఉంటారు. అటువంటి వారికి  తప్పక మానసిక చికిత్స అవసరం.

           మరికొందరు ద్వందార్ధంగా మాట్లాడతారు.వారి మాటలు ఆ సన్నివేశానికి సరిపోయినా, అంతర్గతంగా ఆలోచిస్తే  మనసులో ఎక్కడో చురుక్కుమంటుంది. దానిని అర్ధం చేసుకున్న ఇవతల   వ్యక్తి  కూడా అంతే స్థాయిలో సమాధానం చెప్పినప్పుడు మొదటివ్యక్తి నోరు మూతపడుతుంది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు ఒకే రంగంలో  సమ ఉజ్జీలైన వ్యక్తుల మధ్య చోటు చేసుకుంటాయి.అవే చలోక్తులుగా కూడా మనగలుగుతాయి.

          కొందరు ఉదాసీనంగా, నిరాశావాదం గా మాట్లాడుతూ ఉంటారు. జీవితం లో తామొక్కరే కస్టాలు అనుభవిస్తున్నట్టు, ఎదుటివారిది అసలు కష్టమే కానట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని, వాళ్ళ అభిప్రాయాలను మార్చడం, వారిని ఏమార్చడం చాలా కష్టం. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ...కష్టాలు  ఎదురుదెబ్బలైనప్పుడు తొందరపడకుండా, ఆ కష్టం మనకు జీవితంలో మరేదో పాఠం చెప్పబోతోంది అని. ఆ అనుభవ పాఠమే తనకు స్థితప్రజ్ఞత అలవాటు చేస్తుందని.

           కొందరు గోడమీద పిల్లి వాటంగా మాట్లాడతారు. ఏ విషయమూ స్పష్టంగా చెప్పరు. నిముషం కిందట  ఒకరి వైపు మాట్లాడిన వాళ్ళు, నిముషం తరువాత మరోవైపు మాట్లాడతారు. అలా మాట్లాడి తమ జీవితం మీదే తమకు స్పష్టత లేకుండా చేసుకుంటారు. చివరకు మాట నెగ్గే వైపు మాట్లాడి తమ పబ్బం గడుపు కుంటారు. జీవితం దాదాపుగా పూర్తి అయ్యాక  తమను నమ్మేవారు చాలా తక్కువమంది అని తెలుసుకుంటారు.

                 కొంతమంది ఎదుటి వాడు వింటున్నాడు కదా అని ఉచిత సలహాలు ఇస్తారు.’అదే నేనైతేనా?’... అని ప్రగల్భాలు పలుకుతారు. ‘ ఆపని మీరే చేసి చూపండి’ అంటే మాత్రం వెంటనే తోక ముడుస్తారు.

               ఇక అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళనే మనం ‘’మూర్ఖులు ‘’ అంటాం. ఒకరు చెప్పింది వినడు. తనకు తోచదు. వీళ్ళు జీవితంలో ఊహించని గట్టి దెబ్బలు తింటారు. ఎక్కువశాతం మంది చేత ఛీత్కారం పొందుతారు.తమకు నచ్చకపోతే ఎంతటి వ్యక్తినైనా అవమానించడానికి వెనుకాడరు.తమకు నచ్చిన వారిని వారికిష్టం లేకపోయినా ఆకాశానికి ఎత్తేస్తారు. 

అందుకే మనిషిని మహానీయుడిగా మార్చేది- మాటలు నెమ్మదిగాను, పనులు ఉత్సాహంగా  ఉండే తత్వం అంటారు పెద్దలు. ఎన్ని తెలుసుకున్నా ఎన్ని భూకంపాలు వచ్చినా భూమిని వీడని మనం మనని మంచిగానో చెడ్డగానో ఒక మాట అన్నారని ఆ మాట అన్నవారిని వదిలేస్తాం.

చివరగా మాట జీవితాల్ని ప్రభావితం చేసి అద్భుత శక్తి కలిగిన అస్త్రం. మనిషి జీవితంలో మూడు విషయాలను కోల్పోతే మళ్ళీ జీవితంలో పొందలేము. అవి కరిగిపోయిన కాలం, చేజారుచుకున్న ఆవకాశం, పెదవి దాటిన మాట. ముఖ్యంగా మాట పెదవి దాటితే మొదటివి రెండూ వాటంతట అవే  మనని వదిలి వెళ్ళిపోతాయి.

అందుకే మాటలు చేతలు కావాలి. చేతలు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలి. అలాంటి  వ్యక్తిత్వం గల మనిషి ఆదర్శమూర్తి అవుతాడు..మార్గదర్శి అవుతాడు.జాతిని పునరుజ్జీవింప చేసే మహానీయుడౌతాడు!!!                                                          

కొత్తపల్లి ఉదయబాబు 

 

ఎడిటర్ ఇన్ చీఫ్