విషయ సూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒక్కరు 4 ఫ్యాబ్ లివింగ్ 7 మహిళా శక్తి 11 నేటి సౌదామిని 15 మేలుకొలుపు 20 రాంపా కార్టూన్ కెచెప్ 23 సాహిత్యం సాహితి మార్గదర్శకులు 24 కథ సమయం 30 నేటి కవిత్వం 41 పుస్తక దర్పణం 42 సంస్కృతి 44 యువత స్నేహ స్వరం 49 కార్య భారతం 52 జిజ్ఞాస 57 రాజకీయం సందర్భం 60 జాతీయం 63 తెలంగాణం 72 ఆంధ్ర దర్పణం 73 సినీ దర్పణం గత సినీ వైభవాలు 76 సినీ హోరు 79 సీరియల్ 83 మా తత్వం 86
వోటు హక్కుని వినియోగించుకోవడం ప్రజాస్వామ్య దేశాల్లోని ప్రతి పౌరుడి హక్కే కాకుండా ఒక ప్రత్యేకమైన బాధ్యత .దేశ భవిష్యత్తు అంతా కూడా ఒక పౌరుడి ఆలోచనా,వివేచనల మీద ఆధారపడి ఉంటుంది. దురదృష్టవశాత్తు పల్లెల్లోని ప్రజలు వోటు హక్కుని వినియోగించుకున్నంతగా పట్టణాలలో ఉన్నవారు ఉపయోగించుకోవడం లేదు. యేటికేడాది వోటర్ల సంఖ్య పెరుగుతున్నా ఎన్నికల సమయం లో వోటు వేసేవారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నా ముఖ్యమైనది “ఇది నా దేశం. ఈ దేశం ఒక మంచి పరిపాలకుడి చేతిలో ఉంటే నేనే కాక నా తరువాతి తరం వారు కూడా హాయిగా ఉంటారు. అందుకు నా చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం నా వోటు” అని పౌరులందరూ అనుకోకపోవడం. వోటును నమ్ముకోవడం బదులు అమ్ముకోవడం అనే ప్రక్రియ ఎప్పుడైతే మొదలయిందో డబ్బున్న వాడిదే రాజ్యం అయింది.
వోటు వేయకపోతే తమని పరిపాలిస్తున్న వారి గురించీ, పరిపాలన గురించీ విమర్షించే హక్కు వారికి ఉండదు.చదువుకున్న వారు,మేధావులు అనుకుంటున్న వారు తమ తమ ఆలోచనలను ఇంటిలో చర్చల వరకే పరిమితం చేసుకుని వోటు హక్కుని ఉపయోగించడం కొరకై ఇచ్చిన సమయాన్ని వినోదానికై వెచ్చించడం మనం పట్టణ ప్రాంతాలలోనే గమనిస్తాము. ఒక వేళ వేద్దామన్న కోరికతో వెళితే ఈవీఎం లు సరిగ్గా పని చేయకపోవడం,తీరా అక్కడికి వెళ్ళాక తమ పేరు లేకపోవడం లేదా అప్పటి వాతావరణ పరిస్తితులు అనుకూలించకపోవడం వంటి వాటితో వోటు వేయడానికి వెనకడుగు వేస్తున్నారు. పల్లె ప్రాంతాల్లోని వారు ఎక్కువగా ఉపయోగించుకు న్నా వారు ఏదో విధంగా ప్రభావితులై వేసిన వారే అయి ఉంటారు కాని తమ స్వంత ఆలోచనతో వేసే వారు కాదు. చదువుకున్నవారు రాజకీయాల మీది విరక్తే కాని ,కుళ్ళు రాజకీయాల వల్ల కలుగుతున్న చిరాకు వల్ల అయితేనేమి,ఎవరు వచ్చినా మనకు ఒరిగేదేమి అనుకోవడం వల్ల అయితేనేమి, ఎన్నికల సమయం లో ఏర్పడుతున్న అవరోధాల వల్ల అయితేనేమి వోటు వేయడానికి కొద్దిగా అనాసక్తి పరులై ఉంటున్నారు.అందువల్ల జరుగుతున్నదేమిటి అంటే, అందరితో పాటు ఓటు వేయని, చదువుకున్న వారిని పరిపాలించే వారిని ఎన్నుకుంటున్నవారు ప్రలోభానికి లొంగుతున్న వారు.. ఇది నిజంగా చాలా విచారించదగ్గ విషయం.
మంచి దక్షత గల నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉన్న వోటు హక్కుని వినియోగించుకోకుండా మార్పు రావాలి,దేశం అభివృద్ధి పథం లో పయనించాలి అంటే ఎటువంటి ఉపయోగం లేదు. మంచి మార్పు దేశం లో రావాలి అంటే యువత నడుం బిగించాలి. అందుకే మన ఎలెక్షన్ కమీషన్ వారు ప్రతి సంవత్సరం జనవరి 25 ని “ జాతీయ వోటరు దినోత్సవం” గా ప్రకటించారు.
1950 జనవరి 25 న మన దేశ ఎలెక్షన్ కమీషను ప్రారంభమైనా 2011 జనవరి 25 నుండి ప్రతీ సంవత్సరం జాతీయ వోటరు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.ముఖ్యంగా జనవరి 25 నాటికి 18 సంవత్సరములు పూర్తి చేసుకున్న యువత వారి వోటు హక్కుని వినియోగించుకోవడాన్ని ప్రోత్సహించడానికి వోటరు దినోత్సవాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం గౌరవనీయులైన భారత రాష్ట్రపతి అధ్యక్షతన జాతీయ వోటరు దినోత్సవ వేడుకలు జరుగుతాయి. అనేక రకాలైన అంశాల్లో పోటీ పరీక్షలు నిర్వహిస్తారు.ముఖ్యంగా ఈ పరీక్షలలో యువత పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. యువతని ఆకట్టుకునే విధంగా అధ్యక్షులు ప్రసంగిస్తారు.
ప్రతి సంవత్సరం 18 సంవత్సరములు పూర్తి చేసుకున్న యువత తమ పేరును వోటరు లిస్ట్ లో నమోదు చేయించుకోవాలి. ఆ దిశగా తమ పిల్లలను తలితండ్రులు ప్రోత్సహించాలి. సాంప్రదాయ పండగలైన దసరా దీపావళి,సంక్రాంతి మొదలైనవి ఎలాగో, జాతీయపండగలైన ఆగష్టు పదిహేను, గణతంత్ర దినోత్సవము ఎలాగో జాతీయ వోటరు దినోత్సవము కూడా కొత్తగా వోటు వేయబోయేవారి వోటరు పండగ. భారతదేశం ప్రపంచములోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశము. ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించే వారు సమర్ధులై అవినీతికి, బంధుప్రీతికి ఆస్కారం లేని వారై ఉండాలి. అటువంటి వారిని ఎన్నుకునే అవకాశం ప్రతివారికి 18 సంవత్సరములు నిండగానే కలుగుతుంది. అందుకే 18ఏళ్ళు నిండగానే తప్పని సరిగా తమ పేరుని నమోదు చేసుకోవాలి. ఎన్నికలు ఏ స్థాయిలో జరిగినా ప్రతివారూ కూడా తమ ఓటు ని గౌరవించుకోవాలి. యువత తాము తమ వోటుని వేయడమే కాకుండా గ్రామ స్థాయిలో కూడా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి గ్రామస్తులకు వారి ఓటుని సక్రమంగా ఉపయోగించుకునే విధం తెలియ చేయాలి.ప్రభుత్వం వారు కూడా ఎన్నికల నిర్వహణ సమర్ధవంతంగా నిర్వహించి ప్రతివారూ ఓటు వేసే విధంగా ఉత్సాహాన్ని పెంపొందించాలి. వోటర్ల సంఖ్య జనాభా తో పాటు పెరుగుతుంది.. వోటింగ్ శాతం పెరిగినప్పుడే ప్రజల్లో వోటు హక్కుని వినియోగించడం పై అవగాహన పెరిగిందన్నది స్పష్టమవుతుంది
ఆంగ్లములో ఒక స్లోగను ప్రచారం లో ఉంది...Vote for the right by the right of voting… నిజమే కదా?
(జనవరి 25 జాతీయ వోటర్ల దినోత్సవం సందర్భంగా)