విషయ సూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒక్కరు 4 ఫ్యాబ్ లివింగ్ 9 ఆరోగ్య వాణి 12 మహిళా శక్తి 16 నేటి సౌదామిని 19 మేలుకొలుపు 23 సాహిత్యం సాహితి మార్గదర్శకులు 26 కథ సమయం 29 నేటి కవిత్వం 37 పుస్తక దర్పణం 39 సంస్కృతి 41 కవితామృతం 46 నవలాముత్యం 47 యువత స్నేహ స్వరం 53 కార్య భారతం 56 జిజ్ఞాస 57 రాజకీయం సందర్భం 63 జాతీయం 71 తెలంగాణం 75 ఆంధ్ర దర్పణం 77 ఫన్ కార్నర్ రాజ్య హేలీ 80 నవ్వుల కుంచె 81 సినీ దర్పణం గత సినీ వైభవాలు 82 సినీ హోరు 85 ఇదండీ సంగతి 89 సీరియల్ 91 మా తత్వం 95
సంపాదకీయం
-మణి గోవిందరాజుల
చీకటి వెలుగురేకలను అందుకోకముందే సైకిళ్ళమీదా, బైకుల మీదా కాలాలతో పని లేకుండా బయలుదేరిపోతారు. ఇంటింటికీ వెళ్ళి వాళ్ళ గుమ్మాలముందు వాలిపోతారు...ఘుమ ఘుమలాడే చక్కని కాఫీకి చిక్కని పాలందించడమే కాకుండా ప్రపంచాన్ని అక్షరాల్లో నిక్షిప్తం చేసుకున్న వార్తాపత్రికలను మీకందచేస్తారు. ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ వార్తాపత్రికని చదవడం ఒక మధురమైన అనుభూతి అనుకునే వాళ్ళకళ్ళల్లో వెలుగురేకలు విచ్చుకుంటాయి. ఈ విధంగా అందించే వాళ్ళల్లో ఎక్కువగా యువకులున్నా, మధ్య వయస్కులే కాకుండా చదువుకుంటున్న కుర్రాళ్ళుకూడా ఉంటారు. జీవన సమరం లో తాము సంపాదించే ప్రతి పైసా తమకుటుంబానికి ఆధారమవుతుందనే ఆలోచన వారిని వయస్సుతో నిమిత్తం లేకుండా చీకటి చిందులాడే సమయంలో మేల్కొలుపుతుంది…
రోడ్డు మీద డ్రైనేజీ పైపులు ఎక్కడ పాడయ్యాయో తెలీదు. మలమూత్రాలను కలుపుకున్న మురికి నీరు రోడ్డంతా పారుతూ రోడ్డంతా బ్లాక్ అయిపోయింది. వాసన తట్టుకోలేకుండా ఉన్నది. ఎక్కడ కాలు అందులో పడుతుందో అని భయపడుతూ జాగ్రత్తగా ముక్కు మూసుకుని పక్కనుండి నడుచుకుంటూ వెళ్తున్నారు పౌరులు. అప్పుడొచ్చారు మున్సిపాలిటీ వర్కర్స్. ప్రాబ్లం ఎక్కడుందో తనిఖీ చేసారు. నిలువెత్తు లోతున్న మ్యాన్ హోల్ లోపలికి దిగి ఆ మురికి వాసననంతా భరిస్తూ ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసారు. వారికి తెలుసు, కాలుష్యం తో కూడిన ఆ వాసనలను పీల్చటం వల్ల తమ ఊపిరితిత్తులు తమ ఉనికిని కోల్పోతుంటాయని. కాని కుటుంబం మీది ప్రేమ,మమకారం, బాధ్యత వారిని ఏ పని అనేది ఆలోచించకుండా చేయిస్తుంది.
ముప్పై అంతస్తుల బిల్డింగ్ లో ఇరవై అయిదో అంతస్తులో ఫైర్ ఆక్సిడెంట్ అయ్యింది. రోడ్డుమీది వారు అందరూ కకావికలయ్యి పరిగెత్తుతున్నారు. మంటల్లో చిక్కుకుని కేకలు పెడుతున్న వారిని చూసి ఏమీ చేయలేని నిస్సహాయతతో ఏడుస్తున్నారు చూస్తున్నవారు. అప్పుడొచ్చారు ఫైర్ ఇంజన్ వాళ్ళు. ప్రాణాలకు తెగించి క్రేన్ల సహాయంతో ఇరవై అయిదో అంతస్తులోకి వెళ్ళి అందర్నీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇది వారి ఉద్యోగ ధర్మంలో భాగం అయినా చేసింది కుటుంబపోషణార్ధమే.
అనంతమ్మకి ఆపరేషన్ అయ్యింది. ఇంటికి వెళ్ళొచ్చన్నారు కాని నెలరోజులు మంచం మీంచి కదలడానికి వీలు లేదన్నారు. నర్సులను పంపే ఆర్గనైజేషన్ ని సంప్రదిస్తే ఒక నర్సుని నెలరోజులకోసం పంపించారు. మంచం మీంచి లేవలేని పరిస్థితిలో ఉన్న తనకి పసిపిల్లలకు తల్లి చేసినట్లుగా కుడిచెయ్యి ఎడం చెయ్యి అనుకోకుండా చాలా ప్రేమతో చేసిందని ఎంతో ఆనందపడింది అనంతమ్మ. ఆ నర్సు కుటుంబాన్ని విడిచి ఉన్నది కుటుంబం కోసమె అన్నది విదితమే.
ఇంకా చెప్పాలంటే హాస్పిటల్లో పని చేసే నర్సులు, స్కావెంజర్స్, రోడ్లు ఊడ్చే స్వీపర్లు, బొగ్గుగనుల్లో పనిచేసే కార్మీకులు, కరెంటు స్థంభాలెక్కి ప్రాణాలతో ఆటలాడుకునే కరెంటు ఉద్యోగులు, , అర్థరాత్రి నిద్రనాపుకుని మేల్కొని ఉండే రాత్రి వాచ్ మాన్లు, పొలాల్లో కష్టపడి పనిచేసే కూలీలు, భవనాల కూలీలు, ఆఖరికి ఇళ్ళల్లో పనిచేసే పనిమనుషులు, రాత్రివేళల్లో గాఢనిద్రలో ఉన్న ప్రయాణీకులను సురక్షితంగా గమ్యాన్ని చేర్చే వాహన చోదకులు, ఇలా ఎందరో, ఇంకెందరో లెక్కకి రాని వారు అందరూ కూడా తమ తమ కుటుంబ పోషణార్ధమే తమ విద్యుక్త ధర్మాలను నిర్వహిస్తున్నారు. వారంతా కుటుంబం కోసమే చేస్తున్నా ప్రత్యక్షంగా సమాజానికి వీరు చేసే సేవ సామాన్యమైనది కాదు. వీరందరివీ కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలు కాదు. కారువంటి లక్జరీస్ వీళ్ళకి కలలో మాట. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు కాదు. రోజు గడవడానికి చేసే జీవనసమరంలో సైనికులు. వారి అవసరం వచ్చినప్పుడే వారు మనకు గుర్తొస్తారు. కాని వారే లేకపోతే ప్రజాజీవనమే స్థంభించిపోతుంది అన్నది జగమెరిగిన సత్యం.
మానవుడు సంఘజీవి. ప్రతివారికి కూడా ఒకరితో ఒకరికి అవసరాలు లేకుండా కాలం గడవదు. ఉదయం లేచింది మొదలు తిరిగి రాత్రి పడుకునే వరకు ఎంతో మంది సహకరించడం వల్లే అందరమూ కూడా ప్రశాంతజీవనం గడపగలుగుతున్నాము. వీరందరికీ కృతజ్ఞతా పూర్వక నమస్సులు తెలుపుకోవడం మన విధి. అందుకు మనం చేయవలసింది ఏమీ లేదు. చిరునవ్వుతో వారిని పలకరించడం తప్ప...
ఆవిర్భవ పాఠకులకు “మహా శివరాత్రి” పర్వదిన శుభాకాంక్షలు. ….