తాజాగా 2021లోకి అడుగు పెట్టాం. కానీ 1947లో ఉన్నటువంటి విజన్ మరొకటి లేకుండా పోయింది. ఉన్నదల్లా ఒక్కటే విజన్. బాగా సంపాదించాలి. బాగా బతకాలి. ఎవరికి వారుగా. మరి దేశం కోసమంటూ చేసేదేమీ లేదా? ఇప్పటికైతే లేదు. కానీ ఇప్పటి నుంచి ఉండాలి.. ఉండి తీరాలి. 1947 కంటే పెద్ద విజనే ఉండాలి. ముఖ్యంగా యువతకు.
మనమంతా కలిసి మళ్లీ ఉద్యమం చేసి దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన విజన్ ఒకటి యువత చేతుల మీదుగా ప్రారంభం అవ్వాలి. సమస్యలకు తగిన పరిష్కారాలను చేతల ద్వారా వివరిస్తూ ఆలోచనాత్మక చైతన్యాన్ని నింపే విజనే కావాలి.
ప్రపంచంలో ఎక్కడాలేని యువత ఇండియాలోనే ఉంది. అది దేశ జనాభాలో 65% పైనే. చైనాలో 35% మాత్రమే. మరో 10-15 సంవత్సరాలు మాత్రమే ఇంత గొప్ప శక్తిని మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ సమయం ఉంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే దేశాన్ని ఊహకు అందని విధంగా మార్చవచ్చు. ఆ అడుగులు కనీసం ఇప్పటి నుంచైనా పడితే బాగుంటుంది. ఎందుకంటారా?
ప్రపంచం మనవైపు చూస్తున్నది. భారత్‌కు కళ్లు.. కాళ్లూ అయి నడిపిస్తున్నది యువజనమే కదా? భారతదేశ భవిష్యత్‌ను ఉన్నతంగా లిఖించి ప్రపంచానికి అందించే సత్తా యువతలో ఉందని భారత్ ఒక్కటే కాదు ప్రపంచ దేశాలూ భావిస్తున్నాయి. కాబట్టి నిద్రావస్థలో ఉన్న యువతలో ఇక మార్పు రావాల్సిందే. యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానందుడి ఆశయాలను అందిపుచ్చుకొని దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిందే.
స్టార్టప్స్.. పాలిటిక్సే కాదు.. విద్య.. ఉద్యోగ.. ఉపాధి.. ఉత్పత్తి రంగాల్లోనూ.. త్రివిధ దళాల్లోనూ.. భారత సైన్యంలోనూ యువతరం సత్తా చాటుతున్నది. క్రీడల్లో అయితే దేశానికే ఖ్యాతిని తీసుకొచ్చే విధంగా అద్భుతమైన ప్రదర్శనలిస్తూ క్రీడా భారత్‌గా దేశాన్ని నిలబెడుతున్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా.. ఇన్ని మానవ వనరులు ఉన్నా.. ప్రతీ దేశానికి ఉన్నట్టే మనకూ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించే బాధ్యత.. అవసరం యువతదే కాబట్టి అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని.. ఇంకొందరికి అవకాశం కల్పించేలా యువతరం ఆలోచనలు చేయాలి.అలాంటి యువ తరానికి ఆహ్వానం పలుకుదాం.
" />