ప్రకృతి మనిషి అయితే, వికృతి మృత్యువు! మృత్యువంటే ఏమిటి? మనిషిలోని అగాధమైన, అంధకార బంధురమైన మహారణ్యం... నిజమైన అరణ్యంలో జంతువులు, పశుపక్ష్యాదులూ వున్నట్లే, మనిషి మనసులోని అరణ్యంలో కూడా క్రూరమృగాలూ వుంటాయి. క్రూరత్వం, రాక్షసత్వం, స్వార్ధం, భోగలాలస, బలహీనతలే ఆ క్రూరమృగాలు! అలాగే పశుపక్షులూ వుంటాయి. సాత్వికమైన ఆ పశుపక్షులే దయ, జాలి, ప్రేమ, ధర్మం, ఆర్ధ్రతలు. వందల సంవత్సరాల మానవ పరిణామక్రమంలో శిలాగృహాల్లోంచి, శిలాతోరణాల మీంచి నడిచి, ఆలోచనకల జంతువుగా గుర్తింపు పొంది, సమస్త చరాచర సృష్టిని, తన మేధస్సుతో శాసిస్తున్న మనిషి, మృత్యువు ఎదుట మాత్రం ప్రశ్నార్ధకంగా ఎందుకు నిలబడిపోతున్నాడు...? గడిచిపోతున్న సహస్రాబ్ధుల సముద్ర ప్రవాహం ఒడ్డున నుంచున్న మనిషి కోల్పోతున్నదేమిటి? భౌతికత్వం మాయపొరల మధ్య సాలెపురుగులా చిక్కుకుపోతున్న మనిషి, కరెన్సీ కళ్ళద్దాలలోంచి ప్రపంచాన్ని ఎందుకు చూస్తున్నాడు? ఎంత సంపాదించినా, మరెంత కూడబెట్టినా, వారసులకు మూటలకు మూటలు కట్టపెట్టినా, అవి వాళ్ళకు పదితరాలకు సరిపోతుందని లెక్కేసుకున్నా, ఇంకా ఇంకా ఎందుకు సంపాదిస్తున్నట్టు? అణువణువూ, అణురణం పర్యంతమైపోతున్న ప్రస్తుత పరిస్థితులలో, మానవాత్మ స్వాంతన పొందేదెప్పుడు...? చెమట బిందువుల్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మనిషి, కన్నీళ్ళనెందుకు దూరం చేసుకోలేక పోతున్నాడు? వర్తమాన వ్యవస్థలో మనిషికి కావల్సినదేమి? తాత్త్వికత, అధ్యాత్మికతల పునాదుల్లోంచి పుట్టే సరికొత్త మానవుడే ఈ ప్రశ్నలన్నికి సమాధానమా?