ఛెళ్ళున ముఖాన్ని తాకిందో గాలితెర... ఈదురుగాలితో కూడిన వానజల్లు దెబ్బకు దిమ్మెర బోయాడా సైనికుడు. భయం భయంగా ఆకాశం వంక చూసాడు. ఉరుములు, మెరుపులతో భీభత్సంగా ఉంది ఆకాశం. ప్రళయకాలాన్ని తలపిస్తోంది వాతావరణం. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రగిరి రాజ్యం భయం గుప్పిట్లో చిక్కుకుంది. భద్రగిరిపురం చలికి గజగజ వణుకుతోంది. రాజధాని ప్రజలు ఇంత అకాల వర్షాన్ని ఎన్నడూ చూడలేదు. మండు వేసవిలో మహాప్రళయాన్ని తలపించే ప్రకృతి భీభత్సం. భద్రగిరి ప్రజలు ఏటా వేసవి కాలంలో వచ్చే వసంతోత్సవాన్ని ఆనందోత్సాహాలతో అతి వైభవంగా జరుపుకుంటారు కాని ఈ ఏడాది అకాల వర్షం ఆనందానికి బదులు వారిని అంతులేని భయాందోళనలకు గురిచేసి పండుగ ఉత్సాహాన్ని తుడిచివేసింది.