విషయ సూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒక్కరు 5 ఫ్యాబ్ లివింగ్ 8 మహిళా శక్తి 15 నేటి సౌదామిని 18 మేలుకొలుపు 21 రాంపా కార్టూన్ కెచెప్ 25 సాహిత్యం సాహితి మార్గదర్శకులు 26 కథ సమయం 29 నేటి కవిత్వం 37 పుస్తక దర్పణం 39 సంస్కృతి 41 యువత స్నేహ స్వరం 40 కార్య భారతం 49 జిజ్ఞాస 55 రాజకీయం సందర్భం 57 జాతీయం 61 తెలంగాణం 66 ఆంధ్ర దర్పణం 68 సినీ దర్పణం గత సినీ వైభవాలు 70 సినీ హోరు 73 సీరియల్ 78 మా తత్వం 83
సంపాదకీయం
మణి గోవిందరాజుల
ఎన్నో ఆశలు. ఎన్నో కోరికలు. ఎన్నో ప్రమాణాలు. పాత సంవత్సరం లో జరిగినవన్నీ మర్చిపోయి కొత్త ఉత్సాహంతొ కొత్త కోరికలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాము.అన్నిటికీ కొత్త సంవత్సరం ఆశలు చూపిస్తుంది.ఊరిస్తుంది.
రా రమ్మని చేతులు చాచి ఆహ్వానిస్తుంది.నూతన సంవత్సరం లో చేయాల్సిన పనులను, చేరాల్సిన లక్ష్యాలను గురించి చాలా మంది ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు
ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నూతనసంవత్సరము వారి వారి సంస్కృతీ సంప్రదాయాలను, గ్రహస్థి తులను బట్టి ఏర్పరుచుకున్నా ప్రపంచము లోని అందరూ ఒకేసారి జరుపుకునే వేడుక ఆంగ్ల క్యాలండరు ప్రకారము జనవరి ఒకటి.
రోమన్ దేవత జానస్ పేరు మీదుగా ఏర్పడిన నెల జనవరి. ఆ దేవతకు రెండు తలలు. వెనక ఒకటి ముందు ఒకటి ఉంటాయి. వెనక ఉన్న తల గడిచిన కాలాన్ని తలచి మంచి చెడులను బేరీజు వేసుకుంటుంది. ముందు ఉన్న తల భవిష్యత్తు కాలాన్ని గురించి హెచ్చరిస్తుంది. మనం కూడా అంతే! గతించిన కాలం లో మనకు జరిగిన ఆనందాలు,అన్యాయాలు, సుఖాలు,దుఃఖాలు,కన్నీళ్ళు, కష్టాలు, అన్నీ తలచుకుని పొందిన సుఖాలకు సంతోషపడి, కలిగిన కష్టం మళ్ళీ మళ్ళీ కలక్కుండా ఏమి చేయాలో ఆలోచించుకునే సందర్భం కొత్త సంవత్సరం లోకి అడుగుపెడుతున్నవేళ. మనకు ఏమి కావాలో?ఏమి చేస్తే, మన జీవితం సాఫీగా సాగిపోతుందో సంవత్సరం పొడవునా తెలిసినా సంవత్సరాంతం లో మాత్రమే వాటిని గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ అలా చేయకూడదని అనుకుంటాము. కాని ఒకసారి అనుకున్నాక దాని కి కట్టుబడి ఉండేవారు చాలా తక్కువగా ఉంటారు. అలా కాకుండా…
జనవరి వచ్చిందంటే పరీక్షల సమయం వచ్చేసినట్లే. విద్యార్థులు తమ భవిష్యత్తుకు పునాదిలాంటి చదువును నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి అదే సమయం లో వొత్తిడికి లోను కాకుండా పరీక్షలకు ప్రిపేర్ అవడం లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. తలితండ్రులు తమకోసం పడుతున్న కష్టాన్నీ, పెంచుకున్న నమ్మకాన్నీ వమ్ము చేయకుండా వారి కోర్కెలు తీర్చే దిశగా తమ ఆలోచనలను కేంద్రీకరించాలి.
సంవత్సరాంతం వస్తున్నదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో గుండెల్లో గుబులు మొదలవుతుంది.కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా అధికారుల అంచనాలు అందుకోలేకపోతారు.ఒక్కసారి మనసులో ఆ భయం మొదలయిందంటే ఏ క్షణానికి ఏమి జరుగుతుందో అన్న ఆలోచనలతోనే సతమతం అయ్యి ఆత్మహత్యలకు పాలపడుతున్నారు. కనిపెంచిన తలితండ్రులకు క్షోభను మిగులుస్తున్నారు. కాని ఆ ఉద్యోగమే జీవితం కాదని, జీవితం ఇంకా ఎన్నో అవకాశాలను కల్పిస్తుందని నమ్మాలి. నమ్మకం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఆత్మవిశ్వాసం జీవించాలనే ఆశను కల్పిస్తుంది. ఐటీ ఉద్యోగులారా ఆలోచించండి.
జీవితంలో ఎన్నో వత్తిడులు. మధ్యతరగతి కుటుంబీకులకు వత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, పురుళ్ళు, పుణ్యాలు పండగలు, ఇవేకాక విధినిర్వహణలో ఒత్తిళ్ళు. ఇవన్నింటినీ సంభాళించుకుంటూ చిన్న చిన్న ఆనందాలూ, సంతోషాలు మిస్ కాకుండా పొందాలి. అందుకని వారింకా సంయమనంతో ఆలోచించటం నేర్చుకోవాలి.ఒత్తిళ్ళను ఎదుర్కునే శక్తిని పెంచుకోవాలి. ఆ దిశగా కొత్త సంవత్సరం రిజల్యూషన్ చేసుకోవాలి, అనుకున్నదానిని ఆచరించగలగాలి.
కొత్తగా పదవీ విరమణ చేసినవారు, ఇంకా పెద్దవారు తమ సమయం గడవడం లేదని బాధపడకుండా తాము సమాజానికి ఏమి చేయగలమో అని ఆలోచించాలి. ఈ రోజుల్లో అరవై పైన డెబ్బై అయిదు లోపల వయసు వారు వృద్ధుల జాబితాలోకి రారు. మేము వృద్ధులమయ్యామే అనుకుంటే కాలం భయపెడుతుంది. కాలాన్ని ఎదిరించగలిగే సత్తా ఉందనుకుంటే కాలం ఒదిగి ఉంటుంది. ఒక సంవత్సరం గడిచిందంటే మన జీవితం తరిగిందన్నమాటే.
మిగిలిన జీవితాన్ని సద్వినియోగపరచుకునే దిశగా అరవై దాటిన యువకులు కొత్త సంవత్సరపు ప్రమాణం చెసుకోవాలి.
అన్నిటికంటే ముఖ్యంగా ప్రతివారూ మానవత్వపు పరిమళాలను మదిలో నింపుకుని తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సుగంధ పరిమళభరితం చేయాలని కోరుతూ, ఆవిర్భవ పాఠకులందరికీ
“ 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు”