కొద్దిక్షణాల మౌనం తర్వాత నోరు విప్పారు గురువు దివోదాస ధన్వంతరీ దీక్షితులవారు. “రేపు ఉదయాన్నే నమ్మకస్తులయిన మనవాళ్ళు నలుగుర్ని అగ్నిగుండం గూడేనికి పంపించు. ఆ గిరిజన గ్రామంలో మందుల మారెమ్మ అనే వృద్ధురాలు ఉందని, ఆమె ఆశ్రమం నుంచి మనుషులు వచ్చారని తెలిస్తే, భయపడి బయటకే రాకపోవచ్చు. మనవాళ్ళని జాగ్రత్తగా ప్రవర్తించమని చెప్పు... ఆమె ఆ విద్యలు ఎక్కడ నేర్పుకుంది...? ఏమేం మందులు తయారుచేస్తుంది...? ఎలా తయారుచేస్తుంది...? ఎలా ప్రయోగిస్తుంది...? ఇవన్నీ మనవాళ్ళు తెలుసుకోవాలి. ఆమెకు ఈ విద్యలు నేర్పిందెవరు? చతుషష్టి కళలు, పాంచాలకీ విద్యలు నేర్చుకున్న స్త్రీలు, కోరినవి సాధించుకోగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉండేవాళ్ళని చరిత్ర చెబుతోంది. ఆ గణికలు ఎవరన్నా అగ్నిగుండం గూడెం పరిసర ప్రాంతంలో నివసించే మారెమ్మకు తెలుసా...? అలాంటివాళ్ళు నాగరికత ఆనవాళ్ళు లేని లోతట్టు అటవీ ప్రాంతాల్లో, ఆటవిక, గిరిజన గ్రామాల్లో ఉండే అవకాశం లేకపోలేదు. మనకు ఒక గణిక స్త్రీ దొరికినా చాలు... వశీకరణ రహస్యాలు తెలుసుకోవచ్చు.