నిశ్శబ్ద నీరవాన్ని చీల్చుతూ ఒక నక్క పెద్దగా ఊళ పెట్టింది. వెను వెంటనే క్షుద్ర క్రిమి కీటకాదులు కర్ణహేయంగా అరుపులు మొదలుపెట్టాయి. దట్టంగా పెరిగిపోయిన వెదురుపొదలు గాలికి జడలు విరబోసుకున్న పిశాచ సమూహం నర్తించిన విధంగా వూగిపోతున్నాయి. ఎండు పుల్లలు బరువయిన బూట్ల క్రిందపడి ‘కర కర’ మంటూ విరిగి వికృతంగా శబ్దిస్తున్నాయి. “మిస్టర్ గోవర్ధన్.... ప్లీజ్ స్టాప్...” నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ వినిపించింది చీకటిలోంచి ఒక కంఠం. జయింట్ జైజ్ టార్చ్‌లైట్ వెలుగులో ముందుకు అడుగు వేయబోతున్న గోవర్ధన్ అనబడే వ్యక్తి చటుక్కున ఆగిపోయాడు. టార్చ్‌లైట్ వెలుగు అదృశ్యమయింది. మళ్ళీ దట్టమయిన చీకటి... విసురుగా వీస్తున్న గాలి శబ్ధం... వేయి త్రాచుల బుసల్లా... శరీరాలను జలదరింప చేసేట్టుగా.