శ్రీరస్తు... శుభమస్తు...!!! "ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక" ... శ్రీ కాళోజీ గారు. “చిరిగిన చొక్కా అయినా తొడుక్కో-.కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో" ...శ్రీ కందుకూరి వీరేశలింగం గారు. ఈ నాటి సమాజంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే పత్రికలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ దేని ప్రత్యేకత దానిదే...ప్రతీ పత్రిక తన ప్రత్యేకతని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాయి. చేస్తున్నాయి. అవి అలా నిలబెట్టేలా ఆ పత్రికా సిబ్బంది నిరంతరాయం కృషిచేస్తారు.అది వారి బాధ్యతగా తలుస్తాము కానీ వారి వెనుక ఒక అద్భుత లక్ష్యం దాగి ఉంటుందన్నది అక్షరాల నిజం. తమ శ్రమ శక్తిని చమురుగా చేసి తమకు అన్నం పెట్టే పత్రిక అనే జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు వారు. ఇపుడు మీముందుకు మేము అదే ప్రయత్నం తో వస్తున్నాం. ప్రతి పక్షం మిమ్మల్ని అలరించే శీర్షికలతో, మీలోని సాహితీపటుత్వాన్నీ నింపుతూ చదివించే సాహిత్యంతో, సామాజికంగా జరుగుతున్న పరిణామాలను మీ దృష్టికి తీసుకువస్తూ... అలాంటివి అసలు జరుగకుండా ముందు జాగ్రత్తలు వహించే సూచనలు సలహాలు... నిపుణుల సహాయం తో తీసుకుంటూ మీకు రస రమ్యంగా మీ - మా - మన పత్రికను నిలపాలన్నదే మా ధ్యేయం... లక్ష్యం. బ్రహ్మ దేవుడు సృష్టి చేస్తున్న సమయంలో బొమ్మలను చేసి వారి వారి కర్మఫలాలను నుదుటిరాతగా రాయడం మొదలు పెట్టాడు. అపుడు నారదుడు "తండ్రీ...మీరు స్త్రీ పురుషులిద్దరిని సృష్టిస్తున్నారు. నిర్మొహమాటంగా అందరి జాతకాలను వారివారి నుదుట రాస్తున్నారు.కష్టాలు పడేవారి పట్ల జాలి, సుఖపడిపోతున్నవారిపట్ల చిరాకు కలగదా మీకు.?" అని ప్రశ్నించాడు. అపుడు బ్రహ్మదేవుడు నారదుడిని దగ్గరగా పిలిచి తన కిరీటం అతని తలమీద పెట్టి "ఏం కనిపిస్తోంది" అని అడిగారు. దానికి నారదుడు తనకు అందరూ ఒకేలా కనిపిస్తున్నారని, ఒక తండ్రికి పుట్టిన పిల్లల్లా సమానంగా ఉన్నారని సమాధానంగా చెప్పాడు. దానికి బ్రహ్మదేవుడు "నేను సృష్టించే ప్రాణులందరూ నాకు సమానమే."అని సెలవిచ్చాడు. ఇదే దృష్టితో పాఠకులందరూ మా పత్రికను ఆదరించి ముందుకు నడిపిస్తారని నడిపించాలని కోరుకుంటూ...మళ్లీ వచ్చే పక్షం ...!!!